హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మారటం ఖాయమని నల్లగొండ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ పార్టీ మోకాళ్ల మీద నడిచినా అధికారంలో రావడం కల్ల అన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు 12 బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఇష్టారీతిగా నోరుపారేసుకుంటే ప్రజలే ఆయన నాలుకను చీరేస్తారని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ హయాంలో ముగ్గురు మంత్రులుగా పనిచేసినా.. జిల్లాకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, ఆర్ రవీంద్రకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానుకోవాలని రేవంత్‌కు హితవు పలికారు.
కలెక్షన్ల కోసమే రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. స్థాయిని మరిచి వ్యక్తిగత విమర్శలు చేస్తే నల్లగొండ ప్రజలు రేవంత్ నాలుక కోస్తారని, ఓట్ల రూపంలో బట్టలు ఊడదీస్తారని హెచ్చరించారు. పైసలు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాననే అహంకారమో లేక చంద్రబాబు ఏజెంట్‌నని తాను ఏది మాట్లాడినా చెల్లుతుందని వ్యవహరిస్తే ఊరుకోబోమని తెలిపారు. ఆస్తుల విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన సవాల్‌కు తోకముడిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తిరిగి అదే ఆరోపణలు చేయటం నీతిమాలిన చర్యలకు నిదర్శమని చెప్పారు. జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, కోమటిరెడ్డిని ఇప్పటికే నల్లగొండ జిల్లా ప్రజలు మట్టికరిపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఉద్యమంలో రాజీనామాలు చేయకుండా పారిపోయిన జానారెడ్డి, తన కాంట్రాక్ట్ పైసల కోసం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామా చేసిన కోమటిరెడ్డి నిజస్వరూపం జిల్లా ప్రజలకు బాగా తెలుసని కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు.
దొంగలకు సద్దికడుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ దొంగలకు సద్దికడుతున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్ పకన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు బాడీ గార్డుల్లా నిలబడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని, కోమటిరెడ్డి బ్రదర్స్‌ను నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ కాలికి గోటికి కూడా సరితూగరని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. మండలాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరైనంత మంది ప్రజలు కూడా కాంగ్రెస్ నిర్వహించిన నిరుద్యోగసభకు రాలేదని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు, శరీర ఎత్తుపొడవుల గురించి మాట్లాడే రేవంత్.. ముందు తాను ఎంత ఎత్తు ఉన్నారో చూసుకోవాలని చురక అంటించారు. అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ తరువాత అంతటి దార్శనికుడు సీఎం కేసీఆరేనని కొనియాడారు.
‘పైకి నవ్వులు లోపల కత్తులు’ అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉన్నదని ప్రజలు ఈసడించుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యక్తిత్వ, రాజకీయ ప్రస్థానాలపై పీహెచ్డీ చేయదగ్గ అంశాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరడుగల పొడుగున్నోళ్లు నల్లగొండ జిల్లాలో ఆరెకరాలకు నీళ్లిచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ.. తన తమ్ముడు, బీజేపీకి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పిన బ్రోకర్ కోమటిరెడ్డికి మాట్లాడే నైతిక హక్కులేదని హితవుపలికారు. ఒకరికి పుస్తెకట్టి మరొకరితో సంసారం చేసే నైజం కోమటిరెడ్డిదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్ మాట్లాడుతూ.. దశాబ్దాలపాటు రాష్ర్టాన్ని, నల్లగొండను ఏలిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎడారిగా మారిస్తే.. సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేశారని స్పష్టం చేశారు.