హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నీట్ (యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఆలిండియా టాపర్లుగా నిలిచారు. వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ వారు లేకపోవడం గమనార్హం. రాష్ర్టానికి చెందిన విద్యార్థి అనురన్ ఘోష్ 99.996614 పర్సంటైల్‌తో ఆలిండియా 77వ ర్యాంకును కైవసం చేసుకొన్నాడు. ఇక ఎస్టీ కోటాలో గుగులోత్ వెంకట నృపేష్ ఆలిండియా మొదటి ర్యాంకును, లావుడ్యా శ్రీరామ్‌నాయక్ ఆలిండియా రెండో ర్యాంకును పొందారు. వీరు ఓపెన్ కోటాలోనూ ఉత్తమ ర్యాంకులు సాధించారు.
గుగులోత్ వెంకట నృపేష్ ఆలిండియా 167 ర్యాంకు, లావుడ్యా శ్రీరామ్‌నాయక్ ఆలిండియా 453 ర్యాంకును కైవసం చేసుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా వైద్యవిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది 24,06, 079 మంది విద్యార్థులు నీట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. వీరిలో 23,33,297 మంది పరీక్ష రాయగా, 13,16,268 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అయితే నిరుడు తెలంగాణ నుంచి 58శాతం విద్యార్థులే క్వాలిఫై కాగా, ఈ ఏడాది 60 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.