TS Minister Talasani | అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. జైన్ సేవా సంఘ్‌కు ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన రెండు ఎకరాల భూమి మంజూరు పత్రాన్ని మంత్రి తలసాని.. శనివారం ఎస్వీఐటీ ఆడిటోరియంలో సంఘ్ నేతలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లతో కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నదని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలను ఇబ్బందుల పాల్జేస్తున్నదన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చరిత్రలో నిలిచిపోయే గొప్ప నిర్మాణం యాదాద్రి దేవాలయం అని తలసాని చెప్పారు.