పాట్నా, జనవరి 10: బీజేపీ కూటమి అధికారంలో ఉన్న బీహార్‌లో మద్య నిషేధం అపహాస్యం పాలవుతున్నది. తొమ్మిదేండ్ల క్రితం రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించారు. అయితే అడుగుకో క్వార్టర్, గజానికో ఫుల్ సీసా తరహాలో పెద్దయెత్తున అక్రమ మద్యం ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఆ రాష్ట్రంలో లభిస్తున్నది. గట్టి నిఘా పెట్టామని అధికారులు ప్రకటిస్తున్నా నిత్యం భారీగా రాష్ట్రంలోకి మద్యం తరలి వస్తున్నది.
దీనికి అధికారులు, నేతల అండ పుష్కలంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్క 2025లోనే రాష్ట్రంలో 36.3 లక్షల లీటర్ల అక్రమ మద్యం పట్టుపడగా, 1.25 లక్షల మందిని అరెస్ట్ చేశారు. దీనిని బట్టి అక్కడ మద్య నిషేధం ఏ స్థాయిలో అపహాస్యం పాలవుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు కొత్త మార్గాల్లో మద్యాన్ని స్మగ్లింగ్ చేసి రప్పిస్తూనే ఉన్నారు. గత ఏడాది 18.39 లక్షల లీటర్ల ఐఎంఎఫ్ఎల్, 17.39 లక్షల లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, 1.25 లక్షల మందిని అరెస్ట్ చేశామని డీజీపీ వినయ్ కుమార్ మీడియాకు తెలిపారు.
ఇది 2024తో పోలిస్తే 3 శాతం అధికమని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమ మద్యం వ్యాపారం రాష్ట్రంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. కొంతలో కొంత ఊరట కలిగించే విషయమేమిటంటే 2025లో రాష్ట్రంలో గుడుంబా మరణాలు పెద్దగా సంభవించకపోవడం. రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న 289 మంది వ్యక్తులను గుర్తించామని, బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం వారి ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. ఇలా ఉండగా, 2025లో బీహార్ రాష్ట్రంలో నేరాల శాతం గణనీయంగా తగ్గిందన్నారు. హత్యలు 8.3 శాతం, దోపిడీలు 26.9 శాతం, అల్లర్లు 21.5 శాతం తగ్గినట్టు వివరించారు. అత్యవసర హెల్ప్‌లైన్ 112 ప్రతిస్పందన సమయాన్ని 14 నిముషాలుగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.