హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అలయ్..బలయ్ అట్టహాసంగా సాగింది. కళాకారుల ఆటపాటలతో ప్రాంగణం మార్మోగింది. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ‘దోస్తర దిన్ అందమా.. దోస్తి కట్టుకుందామా..’ అంటూ పాడిన పాట ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసింది.
కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్లు గుర్మిత్‌సింగ్, విజయశంకర్, హరికిషన్రావుబాగ్డే, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంపీ బీ. వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి, బీఆర్ఎస్ మహిళా నేత తుల ఉమ, తదితరులు పాల్గొన్నారు.