Akkineni Family | హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): తమ కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన అవమానకర వ్యాఖ్యల పట్ల అక్కినేని కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. మంత్రి తన రాజకీయాల కోసం తమను తీవ్రంగా అవమానించడాన్ని అక్కినేని కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. రెండు రోజులుగా వారు ఆరు ట్వీట్లు చేయగా, ప్రతి ట్వీట్లో వారి ఆవేదన, ఆగ్రహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కినేని అమల, అఖిల్ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్లు చేశారు. జుగుప్సాకరంగా చేసిన వ్యాఖ్యల పట్ల సురేఖను క్షమించే సమస్యే లేదని అక్కినేని కుటుంబం స్పష్టం చేసింది. సురేఖ అవమానకర వ్యాఖ్యలపై తొలి రోజే ‘ఎక్స్’ వేదికగా అమల ఘాటుగా స్పందించారు.
‘మీరు మానవ మర్యాదలను విశ్వసిస్తే దయచేసి మీ నాయకులను అదుపులో ఉంచండి. మీ మంత్రితో నా కుటుంబానికి క్షమాపణ చెప్పించి, విషపూరిత ప్రకటనలను ఉపసంహరించుకోమని చెప్పండి’ అంటూ రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల అక్కినేని అఖిల్ తీవ్ర ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్లు చేశారు. నైతికతను మరిచి కొండా సురేఖ వ్యవహరించిన తీరు సిగ్గుచేటని, క్షమించరానిదని మండిపడ్డారు. కొండా సురేఖ లాంటి వ్యక్తిని క్షమించడానికి సమాజంలో చోటు లేదని అన్నారు. ఆమె వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.
సురేఖ మొదట చేసిన వ్యాఖ్యల్లో, ఆ తర్వాత ఇచ్చిన వివరణలోనూ తమ కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారని అక్కినేని కుటుంబం ఆవేదన చెందుతున్నది. జాతీయ స్థాయిలో తమను అవమానించిన కొండా సురేఖను క్షమించరాదని భావిస్తున్నది. న్యాయపరంగా తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించింది. ఇప్పటికే అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. సురేఖపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రధాని, రాష్ట్రపతిని సైతం కలిసి విజ్ఞప్తి చేయాలని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తున్నది.