హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కేవలం 15 రోజుల్లో 300 డివిజన్లతో మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లేకుండా వార్డుల విభజనా.. ? అంటూ సర్కారును అసెంబ్లీలో నిలదీశారు. ఇది కోర్టుల్లో నిలబడుతుందా..? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ చట్టం 1955 సవరణ బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన సర్కారు తప్పులను ఎత్తిచూపారు. జీహెచ్ఎంసీ జనరల్‌బాడీ మీటింగ్‌లో చర్చ లేకుండా ఆమోదించారు. పైగా టేబుల్ ఎజెండాగా సభలో ప్రవేశపెట్టారని అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ‘జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేశారు. ఓటర్ల జాబితాను ఎలా ప్రామాణికంగా తీసుకుంటారు. భవిష్యత్తులో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను చేపట్టనున్నారు. అప్పుడు మళ్లీ పునర్విభజన చేస్తారా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 2027లో జనాభా లెక్కలు సేకరించిన తర్వాత పునర్విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీజీజీ, ఆస్కీ రిపోర్టును బహిర్గతం చేయాలని, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
చలాన్ల డబ్బులేమవుతున్నాయి..?
నగరంలో ప్రజా రవాణా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, టెస్టుల్లేకుండా నేరుగా లైసెన్స్లిస్తున్నారని అక్బరుద్దీన్ మండిపడ్డారు. ట్రాఫిక్ చలాన్ల డబ్బులెక్కడికి పోతున్నాయని నిలదీశారు. గ్రేటర్లో పావురాలతో శ్వాసకోశవ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. కుక్క కాట్లు కూడా పెరిగిపోయాయని సభ దృష్టికి తెచ్చారు. వసతులు కల్పించకుండా హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచలేమని గుర్తుంచుకోవాలంటూ సర్కార్‌కు సూచించారు. గతంలో ఫ్యాబ్ సిటీ.. ఆ తర్వాత ఫార్మా సిటీ.. ఇప్పుడేమో ఫ్యూచర్ సిటీ అంటున్నారు.. ఈ సిటీ అయినా సాకారం కావాలని ఆకాంక్షించారు.
మూసీని ఎక్కడి నుంచి మొదలుపెడ్తారు?
‘మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తారు? ఈ పథకానికి ఖర్చు చేస్తున్న నిధులెన్ని? ఎప్పటిలోగా పూర్తిచేస్తారు?’ అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ఓవైసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. మీరాలం చెరువు పునరుద్ధరణ మూసీ పునర్వ్యవస్థీకరణలో భాగమా? వేరా? అనేది స్పష్టత ఇవ్వాలని కోరారు. మూసీ ప్రక్షాళనను ఐదు జోన్లుగా విభజించారని, కానీ ఏ జోన్లో ఏ పని చేపడతారో స్పష్టత లేదని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిందని, మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్‌చేశారు. ఈ పథకానికి సంబంధించి డీపీఆర్ రూపొందించారా? లేదా? అనేది సభకు తెలియజేయాలని విజ్ఞప్తిచేశారు. గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తరలిస్తున్నామని చెబుతున్నారు తప్పితే, ఎలా తరలిస్తారో స్పష్టం చేయలేదని ఆక్షేపించారు.