హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతున్నదని, మరో రెండు దశాబ్దాల్లో మన దేశం ప్రపంచంలోనే కీలకపాత్ర పోషించనుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit doval) అన్నారు. చట్టాలు చేయడమే గొప్ప విషయం కాదని, వాటిని పరిరక్షించి, అమల్లోకి తీసుకువచ్చినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో జరిగిన 73వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌కు (IPS probationers passing out parade) దోవల్ ముఖ్య అతిథిగా హాజయర్యారు. ట్రైనీ ఐపీఎస్‌ల కవాతు ఎంతో ఆకట్టుకున్నదని చెప్పారు. పరేడ్‌కు మహిళ నేతృత్వం వహించడం సంతోషకరమన్నారు.
ట్రైనీ ఐపీఎస్‌లు దేశానికి సేవ చేయబోతున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఎస్వీపీఎన్ఏలో 5700 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారని వెల్లడించారు. ఎంతోమంది ఐపీఎస్‌లు దేశానికి గర్వకారణంగా నిలిచారని చెప్పారు. 52 ఏండ్ల క్రితం ఎన్పీఏ నుంచి శిక్షణ తీసుకుని విధుల్లో చేరానని గుర్తుచేసుకున్నారు. 130 కోట్ల మంది ప్రజలనే కాకుండా, 32 లక్షల చదరపు కిలోమీటర్ల భారతదేశ భూభాగాన్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత యువ ఐపీఎస్‌లపై ఉందన్నారు.
ప్రజాస్వామ్యం అనేది బ్యాలెట్ బాక్స్‌లో ఉండేదికాదని, ప్రజలు ఎన్నుకున్న వారు చేసిన చట్టాల్లో ఉంటుందని చెప్పారు. ఆ చట్టాలను పరిరక్షించే బాధ్యత ఐపీఎస్ అధికారులపై ఉందన్నారు. చట్టాలను పరిరక్షించలేకపోయినా, అమలుచేయకపోయినా వాటి లక్ష్యం నెరవేరనట్లేనని వెల్లడించారు.