హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఎక్కువకాలం ఆపలేరని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, లక్ష్మణ్ పేర్కొన్నారు. ఓయూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు ఉదయ్‌కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రశ్నించే విద్యార్థి నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న ఓయూ అధికారులపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమస్యలపై పోరాడుతున్న నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపాలనుకోవడం అవివేకమని పేర్కొన్నారు.