హైదరాబాద్ సిటీబ్యూరో ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలో ఏఐఎంఎల్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. మూడేండ్లుగా ఏఐఎంఎల్తో పాటు డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి ఈ కోర్సులకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఏఐఎంఎల్ కోర్సులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో జేఎన్టీయూ ఈ విద్యాసంవత్సరం నుంచి సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం తీసుకురానున్నది. రూ.లక్ష ఫీజుతో సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఏఐఎంఎల్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
ఎంసెట్ ద్వారా సీట్లు భర్తీ..
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని యూనివర్సిటీ నిర్ణయం తీసుకొన్నది. తొలుత రెగ్యులర్ సీట్లు భర్తీ చేయాలని, ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేసే అవకాశం ఉన్నదని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు.