Theenmar Mallanna | గుండాల, ఆగస్టు 18 : సర్వాయి పాపన్నగౌడ్ గోల్కొండ కోటను జయించడానికి బహుజనులను వెంట బెట్టుకుని వెళ్తే.. బహుజనులు మాత్రం రెడ్డిలను నమ్ముకుని ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మల్లన్న మాట్లాడుతుండగా ఓ వ్యక్తి లేచి అందుకే రెడ్డిలెవరూ ఈ సభకు రాలేదని అన్నారు. అలా అనొద్దని ఆ వ్యక్తిని కొందరు వారించారు.
దాంతో తీన్మార్ మల్లన్న కలుగజేసుకొని ఆ వ్యక్తి చెప్పిన మాటలను తప్పు పట్టొద్దని, ఈ సభకు వారు నిజంగానే రావొద్దని అన్నారు. గౌడ్లు అడుక్కునే వారు కాదని, ఒకప్పుడు ఈ దేశాన్ని ఏలిన వారని కొనియాడారు. వెలమలు, రెడ్డిలు ఇచ్చే మందుకు ఆశ పడి బీసీలు ఓట్లను అమ్ముకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అదే బీసీలు వెలమ, రెడ్డి ఓట్లను మందుతో కొనగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. సర్వాయి పాపన్నగౌడ్ పోరాట పటిమతో బీసీలంతా ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒక్క బీసీ అయినా ముఖ్యమంత్రి అయ్యిండా అని ప్రశ్నించారు. బీసీల నుంచి బీర్ల అయిలయ్య కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హుడేనని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని, అందుకు తాను రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు.