రామగిరి, నవంబర్ 29: నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనూరాధ ఈ నెల 21న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని బేగంపేట కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమెకు రోజుకు రూ.1.50 లక్షల ఖర్చు అవుతున్నదని అనూరాధ భర్త, కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న తెలిపారు. తమ వద్ద డబ్బుల్లేకపోవడంతో స్నేహితులు, దాతల సహకారంతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
వైద్య ఖర్చుల్లో కొంతవరకు విద్యార్థి, ఇతర సంఘాలు సాయం చేశాయన్నారు. ఈ విషయాన్ని అనూరాధ బంధువు ఒకరు ట్విటర్లో మంత్రి కేటీఆర్‌కు పంపించాడు. సా యం చేయాలని కోరాడు. ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. అనూరాధకు మెరుగైన వైద్యం అందించాలని తన టీం సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టీం సభ్యులు మంగళవారం అనూరాధ కుమారుడు సిద్దార్థకు ఫోన్ చేశారు. తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలని, తన భార్య వైద్యానికి దాతలు సాయం చేయాలని అనూరాధ భర్త వెంకన్న కోరుతున్నారు. తమను ఆదుకునేందుకు 9573725861లో సంప్రదించాలని కోరారు.