Pensions | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ పెంచాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని ఏఐడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వర్ రావు హెచ్చరించారు. వికలాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐడీఆర్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్లో జరిగింది.
ఈ సమావేశానికి కొల్లి నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ. 4 వేల నుంచి రూ. 6 వేలు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు రూ. 2 వేల నుండి రూ. 4 వేల వరకు పెన్షన్ పెంచుతామని చెప్పి 6 నెలలు గడుస్తున్న ఇప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే పెన్షన్ల పెంపుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన మాదిరిగానే వికలాంగులకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంది శ్రీనివాస్, మహంకాళి రవీందర్, పులిపాటి శ్రీనివాస్, శంకర్, గోవింద్ రాజు, సమంత, బాలకృష్ణ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.