మాదాపూర్, నవంబర్ 23 : ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించమే ఇందుకు ప్రధాన కారణమని యశోద హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను ఆదివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జీఎస్ రావు మాట్లాడుతూ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను చాలా మంది ఆలస్యంగా గుర్తించడం వల్ల చికిత్సలు సంక్లిష్టంగా మారుతున్నాయని, దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
దీన్ని నివారించేందుకే హైటెక్ సిటీ యశోద దవాఖానలో అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లంగ్ నోడ్యూల్ క్లినిక్‌ను ప్రారంభించామని వెల్లడించారు. ఈ క్లినిక్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్లను మాత్రమే కాకుండా ఇతర సాధారణ ఊపిరితిత్తుల వ్యాధులను కూడా ముందస్తుగానే గుర్తించేందుకు వీలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ‘యశోద’ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వీ నాగార్జున, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖాన స్టోర్‌రూంలో అనుమానాస్పదంగా యువకుడు నితిన్ మృతి చెందగా, ఈ ఘటనపై విచారణకు జాతీయ గిరిజన కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు 15రోజుల్లో విచారణ జరిపి.. పూర్తిస్థాయి నివేదిక అందించాలని నిమ్స్ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. అక్టోబర్ 17న నితిన్ అనుమానాస్పదంగా నిమ్స్ స్టోర్ రూంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవిద్యార్థి ధనావత్ జగదీశ్‌నాయక్ జాతీయ గిరిజన కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జాతీయ గిరిజన హక్కుల కమిషన్.. నిమ్స్ డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. యువకుడి మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదికను కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.