హైదరాబాద్ : వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలని.. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నగంరలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంగళవారం సమావేశమై వ్యవసాయరంగంపై చర్చించింది. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వీసీలు ప్రవీణ్ రావు, నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయరంగ బలోపేతమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైనది వ్యవసాయ రంగం అన్నారు. తెలంగాణలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. అత్యధిక శాతం ప్రజలకు వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తున్నదన్నారు. రాబోయే తరాలను వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాల వైపు నడిపించాలన్నారు. ఆహారం లేనిది జీవరాశి మనుగడ లేదని.. ఆహారానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే వ్యవసాయరంగం మీద సీఎం దృష్టి సారించినట్లు తెలిపారు. చైనాలో అత్యధిక ఉత్పత్తి ఉన్నా అవి ఆ దేశ అవసరాలకే సరిపోతున్నాయన్నారు. కేవలం సిల్క్ మాత్రమే ఆ దేశం ఎగుమతి చేస్తుందన్నారు.
అమెరికాలో అత్యధిక సాగుభూమి ఉన్నా వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని మంత్రి తెలిపారు. యాసంగిలో వేరుశెనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. తెలంగాణలో ఆప్లాటాక్సిన్ రహిత వేరుశెనగ రావడం ప్రపంచమార్కెట్లో డిమాండ్ ఉంటుందన్నారు. నూతన వేరుశెనగ వంగడాలను కనుగొనేందుకు పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. వేరుశెనగ ఉప ఉత్పత్తులు (చిక్కీ – అంగన్ వాడీ, ప్రభుత్వ పాఠశాలలు ) ప్రభుత్వమే తీసుకుంటే దానికి ప్రాధాన్య పెరుగుతుందన్నారు.
రైతుకు మించిన శాస్త్రవేత్త లేడని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సమస్త సమాచారం లభించేలా రైతు సమీకృత కేంద్రాలుగా రైతు వేదికలు నిలవాలన్నారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించాలన్నారు. వరి ధాన్యం నుండి ఇథనాల్ గా మార్చే పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసే విషయం పరిశీలిద్దామన్నారు. స్థానికంగా విత్తన లభ్యత ఉంటే ఆలుగడ్డ సాగును తెలంగాణలో విస్తృతంగా పెంచుకోవచ్చన్నారు. తెలంగాణ వచ్చేనాటికి వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.40 వేల కోట్లు కాగా, నేడు ఆ ఉత్పత్తుల విలువ రూ.94,500 వేల కోట్లకు చేరుకోవడం ఆనందదాయకం అన్నారు.
సహకార రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దాదాపు 150 సహకార సంఘాలు రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్నట్లు తెలిపిన మంత్రి మిగతా సంఘాలను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ అంశంలో మహారాష్ట్ర రైతు సహకార సంఘాలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. దానిని తెలంగాణలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అధ్యయనం చేద్దామన్నారు. ప్రపంచంలో ఒక్క తెలంగాణలోనే రైతుబంధు, రైతుబీమాతో రైతుకు నేరుగా సాయం అందిస్తున్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు.