వనపర్తి రూరల్, ఫిబ్రవరి 19 : తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గిరిజనుల కోసం సేవాలాల్ మహరాజ్ భవనాల నిర్మా ణం చేపట్టినట్టు తెలిపారు. ఆదివారం వనపర్తి జిల్లా రాజపేట శివారులో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటితరం వారికి సంత్ సేవాలాల్ కేంద్రాలు విజ్ఞాన భాండాగారాలుగా మారాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే బడుగు, అణగారిన వర్గాల్లో మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టారని అన్నారు. దీంతో ఏటా భూగర్భ జలాలు పెరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతుల చేతుల్లో 92.5 శాతం సాగు భూమి ఉండగా, అందులో 19 లక్షల ఎకరాలు గిరిజనుల రైతుల చేతుల్లో ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రావణ్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా వనపర్తిలో శ్రీరంగాపురం మండలం నాగరాల సర్పంచ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో 30 మంది తాపీమేస్త్రీలు మంత్రి సమంలో బీఆర్ఎస్లో చేరారు.