హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పలువురు యువకులు ఉన్నత చదువులు చదివి వ్యవసాయం వైపు మళ్లటంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మీరే తెలంగాణ భవిష్యత్తు అని, రేపటి తరానికి ఆదర్శమని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన యువ రైతులు అదీప్ అహ్మద్, జైపాల్ నాయక్, యూట్యూబర్ శివకుమార్‌ను అభినందించించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్ మియాగూడకు చెందిన యువరైతు అదీప్ అహ్మద్ ఎంటెక్ పూర్తి చేశారు. ప్రస్తుతం 10 ఎకరాల్లో బొప్పాయి, జామ, దొండ, వరి సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. అదే మండలానికి చెందిన దెబ్బడగూడ తండావాసి జైపాల్ నాయక్ లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి 1.10 ఎకరాల్లో అవకాడో పంట పండిస్తున్నారు. తద్వారా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లాభాలు సాధిస్తున్నారు. ఇక కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్ యూట్యూబ్ ద్వారా రైతుల విజయాలను ప్రపంచానికి తెలియజేస్తూ వ్యవసాయంలో తన పాత్రను పోషిస్తున్నారు. ఆయన యూట్యూట్ చానల్ లక్ష మంది సబ్స్రైబర్లతో విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ముగ్గురిని మంత్రి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ప్రపంచం సురక్షితంగా ఉంటుందని అన్నారు. సాగుకు దూరమవుతున్న యువత ఇలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలని ఆకాంక్షించారు.