హైదరాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): ఓ వైపు వానకాలం పంటల సాగు సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్నది. మరోవైపు నెల రోజుల్లో మక్కజొన్న వంటి పంటలు కోతకు రానున్నాయి. కానీ వ్యవసాయ శాఖ మాత్రం ఇప్పటివరకు పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియను చేపట్టనేలేదు. కనీసం ఎప్పటినుంచి ప్రారంభిస్తారనే ప్రణాళిక కూడా సిద్ధం చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పంటల కొనుగోళ్లు ఏ విధంగా చేస్తారనేది అయోమయంగా మారింది. ఏ రైతు, ఏ పంట, ఎంత విస్తీర్ణం సాగు వేశారనే క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగానే పంటలు కొనుగోళ్లు చేస్తారు. కానీ ఇప్పటివరకు ఆ వివరాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయలేదు. ఇది పంటల కొనుగోళ్లపై ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నది. క్రాప్ బుకింగ్ పూర్తి చేయడానికి కనీసం నెలన్నర రోజుల సమయం పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొదలు పెట్టినా.. పూర్తి కావడానికి సెప్టెంబర్ నెలాఖరు అవుతుంది. ఇప్పటికే పలుచోట్ల మక్కజొన్న కోతకు వచ్చింది. అక్టోబర్‌లో వరి కూడా కోతకు వస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ శాఖలో ప్రణాళికాలోపం
వ్యవసాయ శాఖలో ప్రణాళికాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుబీమా పథకం గడువు ముగియడానికి రెండురోజుల ముందే రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నది. ఇప్పుడు పంటల నమోదుపై నిర్ణయం తీసుకోవడంపై తాత్సారం చేస్తున్నది. వాస్తవానికి జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటివారం నుంచే క్రాప్ బుకింగ్ ప్రారంభించాలి. కానీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతున్నది. గత సీజన్లో క్రాప్ బుకింగ్ కోసం కేంద్రం అమలు చేస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) విధానాన్ని అమలు చేశారు. ఈ సీజన్లో సాధారణ సర్వే చేస్తారా? లేక డీసీఎస్ అమలు చేస్తారా? అనే అంశంపైనా స్పష్టత లేదు. ముందస్తు ప్రణాళికలు లేకుండా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల తీరుపై ఏఈవోలు తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తక్కువ గడువు విధించి పని పూర్తిచేయాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాకి లెక్కలేనా?
వ్యవసాయ శాఖ ప్రస్తుతం విడుదల చేస్తున్న సాగు లెక్కలన్నీ కాకి లెక్కలేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పంటల సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రతి బుధవారం వీక్లీ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం ఈ నెల 13 వరకు 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్టు పేర్కొన్నది. ఇందులో 45.20 లక్షల ఎకరాల్లో వరి, 44.63 లక్షల ఎకరాల్లో పత్తి, 5.96 లక్షల ఎకరాల్లో మక్క, 4.70 లక్షల ఎకరాల్లో కంది పంటలు సాగైనట్టు పేర్కొన్నది. ఏఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లింది లేదు.. పంటలను పరిశీలించిదీ లేదు. పంటలను సర్వే చేసిందీ లేదు. ఈ నేపథ్యంలో పంటల సాగుపై ఎలాంటి లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిరుడు సాగు అంచనాలను పరిగణనలోకి తీసుకొని 5 లేదా 10 శాతం అదనంగా లెక్కించి సాగు లెక్కలు వేస్తున్నట్టు ఓ ఏఈవో చెప్పడం, ఇప్పటివరకు తమకు క్రాప్ బుకింగ్ ఆదేశాలే రాలేదని సంచలనంగా మారింది.