Admissions | హైదరాబాద్, మే 16 (నమస్తేతెలంగాణ): తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య యూనివర్సిటీల్లోని డిగ్రీ కాలేజీల ప్రవేశాలకు ఈ నెల 22న నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన పదేండ్ల గడువు పూర్తవడంతో ఆ రాష్ట్ర విద్యార్థులకు అమలైన 15 శాతం కోటా రద్దుకానున్నది. దీంతో డిగ్రీ కాలేజీల్లో రాష్ట్ర కోటాలోని సీట్లన్నీ తెలంగాణ స్థానికులతోనే భర్తీ చేయనున్నారు.
ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆ వర్గానికి సీట్లను కేటాయిస్తారు. 3 నుంచి 5 శాతానికి పెరిగిన దివ్యాంగుల రిజర్వేషన్‌ను కూడా అమలు చేయనున్నారు. అగ్రి, హార్టి, వెటర్నరీ విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు సీహెచ్ విద్యాసాగర్, శరత్చంద్ర, భగవాన్ సమావేశమై ప్రవేశాల నోటిఫికేషన్, కౌన్సెలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించి విధివిధానాలను ఖరారు చేశారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
గతంలో నీట్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు నిర్వహించేవారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా దరఖాస్తులు, కౌన్సెలింగ్ దీలను ప్రకటించిన అనంతరం నెలరోజుల్లో మొదటి విడత ప్రవేశాలను పూర్తి చేసి ఆ వెంటనే తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మూడు యూనివర్సిటీల పరిధిలో 1,700కి పైగా సీట్లను భర్తీ చేస్తారు. మొత్తంగా 80 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అవకాశం వస్తుంది. మిగిలిన 20 శాతం సీట్లను భారత వ్యవసాయ పరిశోధన మండలి కోటా కింద, భారత పశు వైద్యమండలి కోటా కింద అఖిల భారత స్థాయిలో భర్తీ చేస్తారు.
మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో రైతు కుటుంబాల పిల్లలకు 40 శాతం సీట్ల రిజర్వేషన్ కల్పించారు. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ 40 శాతం రిజర్వేషన్‌ను రెండు భాగాలుగా చేసింది. 25 శాతాన్ని రైతు కుటుంబాల పిల్లలకు, మిగిలిన 15 శాతాన్ని భూమిలేని వ్యవసాయ కూలీల పిల్లలకు అమలు చేయనున్నది.