హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో రీజనల్ రింగురోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తరభాగం టెండర్లు పిలిచి ఆరు నెలలు దాటినా ఇంతవరకు ఏజెన్సీ ఖరారు కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దక్షిణ భాగం అలైన్మెంట్కు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కానీ దక్షిణ భాగం రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో చేపడుతారా? కేంద్రం ఆధ్వర్యంలో నిర్మిస్తారా? అనేది సందిగ్ధంగా మారింది. ట్రిపుల్ఆర్ ఉత్తరభాగం పనులకు ప్రభుత్వం నిరుడు డిసెంబర్ 27న ఎన్హెచ్ఏఐ ఆన్లైన్ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వరకు టెండర్ల దాఖలుకు గడువు విధించింది. పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచింది. ముందుగా రూ.7,104.06 కోట్లతో 161.5 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించాలని అనుకున్నారు. కానీ ఇటీవల ఆరు లేన్లుగా నిర్మించనున్నట్టు నిర్ణయించారు.
ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో ఐదు ప్యాకేజీలుగా చేపట్టనున్న పనులను రెండేండ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు సుమారు 201కిలోమీటర్ల పొడవున ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ను రూపొందించగా, సోమవారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ట్రిపుల్ఆర్ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం దక్షిణ భాగం అలైన్మెంట్ను సిద్ధం చేసిందని విమర్శలు వస్తున్నా యి. రాష్ట్ర సర్కారు రూపొందించిన దక్షిణ భాగం అలైన్మెంట్ను కేంద్రం ఏ మేరకు ఆమోదిస్తుందో అని అధికారులే సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భాగం భూసేకరణ కొలిక్కిరాలేదు. పలు ప్రాం తాల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయి.