ధర్మసాగర్, జూన్ 20 : తెలంగాణలో కరెంట్ సక్రమంగా సరఫరా కావడం లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన పౌల్ట్రీ రైతు ఎశబోయిన కుమారస్వామి ఆవేదన వ్యక్తంచేశారు. తన గోసను వివరిస్తూ తీసిన వీడియోను గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ‘కొన్ని రోజులుగా విద్యుత్తు అధికారులు కరెంట్ సరఫరా సక్రమంగా చేస్తలేరు.
చిన్నపాటి వర్షానికే విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రెండు రోజుల క్రితం నా పౌల్ట్రీ ఫామ్‌కు కోడిపిల్లలు తీసుకురాగా, కరెంట్ సరఫరా లేక 100 వరకు చనిపోయాయి’ అని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్తు అధికారుల తీరు, వారు మాట్లాడిన విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టాడు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తానని వీడియోలో హెచ్చరించాడు.