TTD | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే తిరుప్పావడ, మేల్ పాల్గొనేందుకు ఓ భక్తుడు వినియోగదారుల కమిషన్ ఆశ్రయించి విజయం సాధించాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన శెట్టి చంద్రశేఖర్ దంపతులు, వారి కుమారుడు, కోడలు తిరుపతిలోని శ్రీవారికి గురువారం చేపట్టే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే మేల్ సేవల్లో పాల్గొనేందుకు 2008 నవంబర్ 26న రూ.21,250 చెల్లించి డీడీ తీసుకున్నారు.
డీడీ ప్రకారం 2021 సెప్టెంబర్ 10న శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు స్లాట్ కానీ కరోనాతో సేవలను రద్దు చేశారు. ఆ తర్వాత ఆ సేవల స్థానంలో బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తామని అధికారులు తెలుపగా, చంద్రశేఖర్ మహబూబ్‌నగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. భక్తులకు శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకపోతే రెండు జంటలకు రూ.10లక్షలు చెల్లించాలని కమిషన్ న్యాయమూర్తి ఎం అనురాధ 2024 మే8న తీర్పు వెలువరించారు.
టీటీడీ దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆశ్రయించగా, జిల్లాలోనే పరిషరించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈనెల 15న భక్తులకు సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారా.. లేక ఆదేశించిన మొత్తంలో 50% డిపాజిట్ లేదా జైలుకు వెళతారా అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు ఆగస్టు 14,15 తేదీల్లో రెండు జంటలకు సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. మొత్తానికి 17 ఏండ్ల తర్వాత దర్శనం సాకారం అయ్యింది.