హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఇప్పటికే పంటల్లో దోమలు, చీడపీడల నివారణకు ఆపసోపాలు పడుతున్న రైతులకు మరో చేదునిజం తెలిసింది. పంటలపై తాజాగా ఆఫ్రికాజాతి నత్తలు దాడిచేసే పరిస్థితులు నెలకొన్నాయని భయంభయంగా ఉన్నారు. ఈ నత్తల దాడిలో పంటలు, పండ్లతోటలు నిలువునా ఎండిపోతున్నట్టు ఉద్యానశాస్త్రవేత్తలు గుర్తించారు. దీని తీవ్రత ప్రస్తుతం తెలంగాణలో అంతగా లేనప్పటికీ.. పొరుగు రాష్ర్టాల్లో జరుగుతున్న పంటనష్టాన్ని చూసిన రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోతున్నది.
లక్షల పెట్టుబడి పెట్టి పంట చేతికి అందే సమయానికి నత్తలు తినేస్తుండటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వీటి నివారణకు ఉద్యాన శాస్త్రవేత్తల వద్దకు రైతులు పరుగులు పెడుతున్నారు. ఈ నత్తలు వేల సంఖ్యలో పొలాలు, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ గడ్డి, ఆకులు, లేత మొకలను తినేస్తున్నట్టు గుర్తించారు. ప్రధానంగా నిమ్మ, బత్తాయి, కోకో, పామాయిల్, బొప్పాయి, అరటి, జామతోటల్లో చెట్ల కాండాల్లోని రసాన్ని పీల్చేస్తున్నాయని అధికారులు గుర్తించారు. దేశంలో మొదటిసారిగా కేరళ రాష్ట్రంలో వీటి ఆనవాలు వెలుగుచూసినట్టు చెబుతున్నారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఉభయగోదావరి జిల్లాల అటవీ ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో ఇవి తిష్టవేసినట్టు గుర్తించారు. అక్కడి నుంచి సమీపంలోని ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలకు విస్తరించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాలున్న ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ ఉద్యాన పంటలు సాగు చేస్తుండడంతో వీటి బెడద ఎంతవరకు ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పంటలపై దాడి చేయకుండా అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిపారు.