హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : కన్వీనర్ కోటాలో భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లపై ఇంకా ఏదీ తేలలేదు. భర్తీచేసే సీట్లెన్నీ..? ఏఏ కోర్సుల్లో ఎన్ని సీట్లున్నాయన్న అంశంపై స్పష్టతలేదు. 2025-26 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ కోసం 170కి పైగా కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఈ కాలేజీలకు అప్రూవల్స్ జారీచేసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీచేయగా, జేఎన్టీయూ పరిధిలోని 70 కాలేజీల అనుబంధ గుర్తింపు పెండింగ్లో ప డింది. అకడమిక్ ఆడిట్సెల్ శుక్రవారం వరకు ప్రక్రియను పూర్తిచేయలేదు. ఎప్సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. 10వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. అంతలోపు అధికారులు అఫిలియేషన్లు జారీచేయడం, సీట్ల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చివరి నిమిషంలో సీట్లను వెబ్సైట్లో పొందుపరచడంతో విద్యార్థులు ఆప్షన్ల నమోదులో తప్పులు చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి స్పందిస్తూ జేఎన్టీయూ అఫిలియేషన్ల ప్రక్రియ దాదాపు కొలిక్కివచ్చిందని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ల నమోదు వరకు సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఇప్పుడే నిద్రలేచిన పాఠశాల విద్యాశాఖ! ; బడులు తెరిచిన 22రోజులకు 157 కొత్త స్కూళ్ల మంజూరు
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ తీరు విచిత్రంగా ఉంది. ఇప్పుడే నిద్రలేచిన చందాన్ని తలపిస్తున్నది. వేసవిలో చేయాల్సిన పనులను బడులు తెరిచిన తర్వాత చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభమైన 22 రోజులకు కొత్తగా 157 సర్కారు బడులను తెరుస్తూ ఉత్తర్వులిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 63, పట్టణ ప్రాంతాల్లో 94 కొత్త ప్రాథమిక బడులను ప్రారంభించనున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. 20మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న హ్యాబిటేషన్లు, పట్టణ కాలనీలు, వార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కాగా ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యింది. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెలలోనే ఫార్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలను సైతం నిర్వహించాల్సి ఉంది. ఆలస్యంగా బడులను తెరవడంతో విద్యార్థులొస్తారా..? ఈ స్కూళ్లు నడిచేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.