హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ ‘జెనెసిస్’ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో దాదాపు 415 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆ కంపెనీ మరో 497 కోట్ల అదనపు ఇన్వెస్ట్‌మెంట్‌తో రీకాంబినెంట్ బల్క్ మ్యానుఫాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. జెనెసిస్ కంపెనీ విస్తరణ ప్రణాళికలపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఇన్సులిన్ ధరలు అందుబాటులోకి రావడంతోపాటు కోట్లాదిమంది డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
ఇప్పటికే సంస్థకు 250 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, తాజా విస్తరణ ద్వారా మరో 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాగా, హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) ఆధారిత ఉత్పత్తుల తయారీలో పేరొందిన జాప్‌కామ్ కంపెనీ తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్‌తో జాప్‌కామ్ ఫౌండర్, సీఈవో కిశోర్ పల్లంరెడ్డి వాషింగ్టన్ డీసీలో సమావేశం అయ్యారు. అనంతరం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. ఫైనాన్స్, టెక్నాలజీ, రిటైల్ రంగాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఈ కేంద్రం నుంచి తయారు చేయనున్నది. అమెరికాతోపాటు ఇండియాలోనూ జాప్‌కామ్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌తో ముందుగా 500 మంది.. ఏడాదిలోగా మొత్తంగా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్లో ప్రముఖ హెల్త్ సొల్యూషన్స్ ఎక్లాట్ మెడికల్ కోడింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత హెల్త్‌కేర్ కంపెనీ 3ఎంనకు మెడికల్ కోడింగ్ క్లినికల్ డాక్యుమెంటేషన్ సేవలను అందించేందుకు ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. దీనికి సంబంధించిన కేంద్రాన్ని కరీంనగర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో మంత్రి కేటీఆర్‌తో 3ఎం, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. కరీంనగర్లో తమ మెడికల్ కోడింగ్, సంబంధిత టెక్నాలజీ సర్వీసుల కేంద్రం ఇప్పటికే పనిచేస్తున్నదని ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ గ్రూప్ సీఈవో ఫౌండర్ కార్తీక్ పొలసాని తెలిపారు. ఎక్లాట్ మెడికల్ కోడింగ్ కేంద్రంలో భవిష్యత్తులో 200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ విజన్‌పై 3ఎం సీఈవో సందీప్ వాద్వా ప్రశంసలు కురిపించారు.
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో త్వరలో 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన వాషింగ్టన్ డీసీలో దాదాపు 30కిపైగా కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ సహకారంతో టెక్నోజెన్ ఇంక్ (వాషింగ్టన్ డీసీ) సీఈవో లక్స్ చేపూరి, బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. డీకంజెస్ట్, డీకార్బోనైజ్, డీసెంట్రలైజ్ అనే త్రీడీ మంత్రతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లను ప్రారంభించామని చెప్పారు. త్వరలో సిద్దిపేట, నిజామాబాద్, నల్లగొండలో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతున్నదని వెల్లడించారు. ఆదిలాబాద్‌లోనూ మరొక ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌లు విజయవంతంగా నడిచేందుకు తమవంతు సహకారం అందిస్తున్న లక్స్ చేపూరి, వంశీరెడ్డి, కార్తీక్ పొలసానిని మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఏరోస్పేస్, డిఫెన్స్ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత రంగాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏరోస్పేస్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ గమ్యస్థానమని వెల్లడించారు. అమెరికాలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు, ఏరోస్పేస్ డిఫెన్స్ స్టార్టప్‌లతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో తమ కార్యకలాపాల పట్ట సంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు.