AEE Results | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 1,154 ‘కేసీఆర్ ఉద్యోగాలకు’ అభ్యర్థులు ఎంపికయ్యారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్(ఏఈఈ) ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. శనివారం 1,154 మంది అభ్యర్థులకు చెందిన ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అయితే ఏఈఈ పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు విడుదల చేసి, రాత పరీక్షలు కూడా నిర్వహించారు.
సెప్టెంబర్ 3, 2022న నోటిఫికేషన్ విడుదల చేసి, గత ఏడాది మే 21, 22న రాత పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి 22 వరకు, తిరిగి ఏప్రిల్ 3న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ముగిసింది. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసి వెరిఫికేషన్ చేశారు.
సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ముగిసినప్పటికీ తుది ఫలితాలు విడుదల చేయడంలో టీజీపీఎస్సీ అలసత్వం ప్రదర్శించింది. ఫలితాలు విడుదల చేయాలని ఏఈఈ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్లో ధర్నా చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో 3 నెలల తర్వాత ఫలితాలు విడుదల చేసినట్టు అభ్యర్థులు వెల్లడించారు.