Chat GPT | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకేజీతోపాటు అభ్యర్థులు అధునాతన గ్యాడ్జెట్లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించి, చాట్‌జీపీటీ సహకారంతో సమాధానాలు గుర్తించినట్టు సిట్ విచారణలో తేలింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పేపర్ లీకేజీ వ్యవహారంపై వరంగల్ విద్యుత్తు శాఖ డివిజనల్ ఇంజినీర్ (డీఈ) రమేశ్‌ను సిట్ విచారించిన సమయంలో మరో కోణం బయటపడింది. ముగ్గురు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో వెళ్లగా, డీఈ రమేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానాలు గుర్తించి, వారికి చేరవేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో డీఈ రమేశ్ సహా నలుగురిని సిట్ సోమవారం అరెస్ట్ చేసింది.
కొనసాగుతున్న అరెస్టుల పర్వం
టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఏఈఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి సిట్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న వరంగల్ డీఈ రమేశ్ ద్వారా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఈ రమేశ్ ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. ఓ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా కొనసాగుతున్నారు. ప్రశాంత్, నరేశ్, మహేశ్ అనే ముగ్గురు అభ్యర్థులకు పరీక్షల్లో సహాయపడేందుకు రూ. 20 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి సంబంధించిన పరీక్షా కేంద్రం నిర్వాహకులతోనూ ముందే డీల్ చేసుకొన్నారు. దీంతో ఈ ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. ఓ ఇన్విజిలేటర్ తన హాలులో గైర్హాజరు అయిన ఒక అభ్యర్థి ప్రశ్నపత్రం ఫొటో తీసి.. బయట సాంకేతిక వ్యవస్థతో సిద్ధంగా ఉన్న డీఈ రమేశ్‌కు వాట్సాప్ ద్వారా చేరవేసినట్టు సిట్ విచారణలో తేలింది. ప్రశ్నలన్నింటికీ రమేశ్ చాట్‌జీపీటీ ద్వారా సమాధానాలు శోధించి, ఆ ముగ్గురు అభ్యర్థులకు చేరవేశారు.
మొదట పరీక్ష రాయకుండా టైంపాస్ చేసిన ఆ ముగ్గురూ… ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ద్వారా సమాధానాలు అందగానే చకచకా బబ్లింగ్ చేశారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే సమాధానాలు వెతికేందుకు చాలా సమయం పడుతుందని భావించిన డీఈ రమేశ్ కృత్రిమ మేధ చాట్‌జీపీటీతో అనుకున్న సమయంలో పనికానిచ్చినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో సోమవారం సిట్ అధికారులు రమేశ్ సహా ప్రశాంత్, నరేశ్, మహేశ్‌ను అరెస్టు చేశారు. కాగా, డీఈ రమేశ్ ఏఈ ప్రశ్నపత్రాలను కూడా విక్రయించినట్టు సిట్ విచారణలో తెలిసింది. అలాగే, ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో గతంలోనే సిట్ అరెస్టు చేసిన పూల రవి కిశోర్ డీఈ రమేశ్‌కు సోదరుడు అని తెలుస్తున్నది. మరోవైపు డీఈ రమేశ్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా ఉన్నందున ఇంకెంతమందికి ప్రశ్నపత్రాలను అందించాడో అన్న కోణంలో సిట్ లోతుగా విచారణ చేపట్టింది.
మరో ఎనిమిది మందికి ప్రశ్నపత్రం
సిట్ అరెస్టు చేసిన వారిలో శ్రీనివాస్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను ఏఈ పేపర్ లీకేజీలో ఉన్నట్టు తెలుస్తున్నది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే నిందితుడిగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేశ్ నుంచి శ్రీనివాస్ ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. ప్రస్తుతం అతడిని అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో సదరు శ్రీనివాస్ తాను పొందిన ప్రశ్న పత్రాన్ని మరో ఎనిమిది మందికి కూడా విక్రయించినట్టు తేలింది. దీంతో ఆ ఎనిమిది మందిని గుర్తించడంలో సిట్ నిమగ్నమైంది. ఇలా ఒక్కొక్కరుగా లింకులు బయటపడుతుండటంతో సిట్ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య 51కి చేరింది.