హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అయినప్పటికీ ప్రతి సోమవారం లబ్ధిదారులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో కొత్త కాన్ఫరెన్స్ హాల్, ఆధునీకరించిన చాంబర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇందిరమ్మ ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇండ్ల పథకాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం, ఇతర అధికారులు పాల్గొన్నారు.