హైదరాబాద్ : డిగ్రీలో బీఎస్సీ డాటాసైన్స్ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు (Admissions ) కల్పించేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఆయా విద్యార్థులకు ఎమ్మెస్సీ డాటా సైన్స్కోర్సు ( MSc Data Science Course)లో ప్రవేశాలు పొందేందుకు కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఆదివారం ప్రత్యేకంగా నోటిఫికేషన్ (Special Notification) ను విడుదల చేశారు.
ఉస్మానియా, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరంలో ఎమ్మెస్సీ డాటాసైన్స్ కోర్సులో ప్రవేశాలు కల్పించనుండగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని పాండురంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో సంస్కరణలను అమలుచేయడంలో భాగంగా 2020 -21విద్యాసంవత్సరంలో బీఎస్సీ డాటాసైన్స్ కోర్సును ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల పరిధిలోని 124 కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టగా, 6,780 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరు ఈ ఏడాదితో డిగ్రీ పూర్తిచేసుకోనుండగా, వీరికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాల్సిన తరుణంలో అధికారులు తాజా అవకాశానిచ్చి, ఎంట్రెన్స్టెస్ట్ నోటిఫకేషన్ను విడుదల చేశారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 8నుంచి ప్రారంభంకానుండగా, విద్యార్థులు 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఇక రూ. 500 ఆలస్య రుసుముతో ఈనెల 19వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇతర వివరాల కోసం www.osmania.ac.in, https://cpget.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.