హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు రెండు పౌరసత్వాలు ఉన్నాయన్న కేసుపై వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించిం ది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రమేశ్ జర్మనీ పౌరసత్వం ఉండగానే భారత పౌరసత్వాన్ని పొందారన్న ఫిర్యాదు మేరకు కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది.
దీన్ని సవా లు చేసిన ఎమ్మెల్యే రమేశ్ తరఫున సీనియర్ న్యాయవాది వై రామారావు వాదన వినిపించారు. జర్మనీ పాస్పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి విఘా తం కలిగించినవారి పౌరసత్వాన్ని రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నదని.. కానీ, రమేశ్ అలాంటి చర్యలకు పాల్పడలేదని కేంద్ర హోం శాఖ నివేదిక ఇచ్చిందని తెలిపారు. దీన్ని దృష్టి లో పెట్టుకొని రమేశ్ పౌరసత్వ రద్దు నిర్ణయా న్ని కొట్టివేయాలని కోరారు.
దీనిపై కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టీ సూర్యకరణ్‌రెడ్డి వాదిస్తూ.. భారత పౌరసత్వ చట్టంలో ని సెక్షన్ 10, సెక్షన్ 7బీ ప్రకారం రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేయడం సబబేనన్నారు. చట్టసభ సభ్యుడిగా ఉన్న రమేశ్ చట్టాన్ని ఉల్లంఘించారని పిటిషనర్ తరఫు న్యాయవాది రవికిరణ్ వాదించారు. దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణించాలని కోరారు. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది.