హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివాదంపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ను జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పుల్లా కార్తీక్ శుక్రవారం విచారణ జరిపారు. తొలుత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవతకవకలు జరగలేదని తెలిపారు. కీపై అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల కమిటీకి సిఫారసు చేశామని, ఆ కమిటీ సిఫారసుల మేరకు రెండు ప్రశ్నలను తొలగించారని వివరించారు.
పిటిషనర్లు చెప్తున్నట్టుగా 7 ప్రశ్నలకు జవాబులు తప్పుగా రాలేదని చెప్పారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణలో జాప్యం జరగడం వల్ల అభ్యర్థులు నష్టపోయారని, ఈ దశలో పిటిషనర్ల వ్యాజ్యాలపై పిటిషన్లపై ఉత్తర్వులు జారీచేస్తే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వ్యాజ్యాలను కొట్టివేయాలని కోరారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రూప్-1 పరీక్షలో దాదాపు 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని తెలిపారు. ఆ సమాధానాలకు దేన్ని ప్రామాణికం గా తీసుకోవాలన్న దానిపై టీజీపీఎస్సీకి స్పష్టత లేదని, కొన్నింటికి తెలుగు అకాడమీని, మరికొన్నింటికి వికీపీడియాను ప్రామాణికంగా తీసుకుని ప్రాథమిక కీని విడుదల చేశారని వివరించారు. గతంలో కూడా ఇదే హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసినప్పటికీ పొరపాట్లను సరిదిద్దుకోలేదని, నిరుద్యోగుల జీవితాలతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆటలాడుకుంటున్నదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత ప్రకటిస్తానని జస్టిస్ పుల్లా కార్తీక్ తెలిపారు.
టీజీపీఎస్సీపై నిరసన
హిమాయత్‌నగర్/సుల్తాన్‌బజార్, అక్టోబర్ 4: హైదరాబాద్‌లోని నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ వద్ద శుక్రవారం వెలిసిన గ్రూప్ 1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఆయా చోట్ల గేట్లు, గోడలకు ఎవరో గుర్తు తెలియని ఆగంతకులు వాటిని అంటించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరూ కొనవద్దంటూ పోస్టర్లలో కోరారు. ‘టీజీపీఎస్సీ అను నేను ఒక నియంతను.. తప్పు జరిగితే ఒప్పుకోను, గ్రూప్ 1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు సిగ్గు సిగ్గు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో‘ అంటూ పోస్టర్లలో రాసి ఉన్నది. ఈ వ్యవహారం ఆయాచోట్ల చర్చనీయాంశంగా మారింది. తెలుగు అకాడమీ వద్ద వెలిసిన పోస్టర్లను నారాయణగూడ పోలీసులు తొలగించి, వాటిని అంటించిన వారి గురించి ఆరా తీస్తున్నారు.