హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): అభిమానం ఉంటే అడుగులు ఆగవు.. ఆరాధించే నాయకుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష ఉంటే దూరం లెకే కాదు.. దీనికి నిదర్శనంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఇద్దరు సామాన్యులు సుమారు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎర్రవెల్లికి చేరుకొన్నారు. ‘కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి’ అనే ఏకైక సంకల్పంతో 11 రోజులపాటు సాగిన వారి పాదయాత్ర గురువారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద ముగిసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తమకున్న అభిమానాన్ని వాంకిడికి చెందిన ఆటో డ్రైవర్ జాడే తిరుపతి, హోటల్ కార్మికుడు దుర్గం శంకర్ వినూత్న రీతిలో చాటుకున్నారు. తమకు ఎలాంటి రాజకీయ పదవి, వ్యక్తిగత ప్రయోజనం, ఆర్థిక సాయం అవసరం లేదని చెప్తూ.. ‘కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి’ అనే ఏకైక ఆకాంక్షతోనే ఈ సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకు సగటున 25 కిలోమీటర్ల చొప్పున 11 రోజులపాటు కాలినడకన ప్రయాణించి సుమారు 300 కిలోమీటర్లు పూర్తి చేశారు. కేసీఆర్ పట్ల అడవిబిడ్డలుగా తమ గుండెల్లో ఉన్న అభిమానమే ఈ ప్రయాణానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు.
‘కేసీఆర్ పాలన కావాలె.. మళ్లీ సీఎం కావాలె’
కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నామని జాడే తిరుపతి, దుర్గం శంకర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తమ పాదయాత్ర ప్రతీకగా నిలువాలని భావించినట్టు పేర్కొన్నారు. ‘కేసీఆర్ పాలన కావాలె.. కేసీఆర్ మళ్లా ముఖ్యమంత్రిగా రావాలె’ అనే నినాదంతో సాగిన ఈ ప్రయాణం ఎర్రవెల్లి చేరుకోవడంతో అభిమానులిద్దరి సంకల్పం నెరవేరింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో కేసీఆర్ను కలిసే అవకాశం వారికి లభించింది. గురువారం ఎర్రవల్లిలోని నివాసానికి చేరుకున్న వారిని కేసీఆర్ ఆప్యాయంగా పలుకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 300 కిలోమీటర్లు నడిచి వచ్చిన విషయాన్ని తెలుసుకొని వారి పట్టుదల, అభిమానాన్ని అభినందించారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా తనను కలిసేందుకు ఇంత దూరం నడిచి వచ్చిన అభిమానుల భుజం తట్టి అభినందించారు. శాలువాలతో వారిని ఘనంగా సన్మానించారు.
మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది: కేసీఆర్
‘మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్న వచ్చి కలువండి’ అంటూ కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ఈ మాటలు తమకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని తిరుపతి, శంకర్ తెలిపారు. అభిమానులతో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించిన అనంతరం కేసీఆర్ వారికి వీడోలు పలికారు. వారి తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయించారు. దీంతో 11 రోజుల సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్న ఇద్దరు అభిమానులు తిరిగి తమ స్వగ్రామానికి బయలుదేరారు.