ఆదిలాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్పొరేట్ కంపెనీలకు అమ్మకానికి పెట్టడంపై మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. విలువైన భూముల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించాలంటూ మంగళవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. సాధన కమిటీ సభ్యులు, యువకులతో కలిసి నల్లబ్యాడ్జీలతో ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి సిమెంటు పరిశ్రమ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీసీఐ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూతపడిన సీసీఐని పునఃప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకున్నదని తెలిపారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి పలు లేఖలు రాసినా స్పందించలేదని ఆరోపించారు. పరిశ్రమను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు హామీ ఇచ్చినా ఫలితం లేదని దుయ్యబట్టారు. ఆరు వేల మందికి ఉపాధి కల్పించే సీసీఐని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి విలువైన భూములను కార్పొరేట్ కంపెనీలకు విక్రయానికి పెట్టిందని ఆరోపించారు.
సిమెంటు పరిశ్రమను కూలగొడుతున్నా బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఉపాధి లేకుండా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐపై కుట్రలను మానుకోవాలని, వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ పరిశ్రమను పునఃప్రారంభించాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.