హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్రెడ్డి సర్కార్ తలపెట్టిన కూల్చివేతలపై అధికార కాంగ్రెస్ పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేతలకు దిగితే బాధితుల పక్షాన కోర్టుకెళ్తానని పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక న్యాయవాదిగా బాధితులపై రూపాయి ఖర్చు వేయకుండా కోర్టులో కేసు వేసి ప్రజలకు అండగా నిలుస్తానని చెప్పారు. మంగళవారం ఆయన కొత్తపేట, చైతన్యపురి డివిజన్లలోని మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి, ఆ ప్రాంతవాసులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. పిల్లాపాపలతో నిశ్చింతగా నిద్రపోవాలని, ఇక్కడి ఇండ్లపై గడ్డపార దిగకుండా తనది గ్యారెంటీ అని చెప్పారు. ఒకవేళ అన్యాయంగా ఇండ్లు కూలగొడితే అధిష్ఠానమే జోక్యం చేసుకుంటుందని, ఈ విషయాన్ని తాను కూడా అధిష్ఠానం దృష్టికి తీసుకుపోయే స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు.
మూ సీ కూల్చివేతల విషయంలో అధికారు లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. మూసీకి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ణయించేందుకు అధికారుల వద్ద ఒక ప్రతిపాదన లేదని, ఏ సంవత్సరం నుంచి మూసీ హద్దులు పరిగణనలోకి తీసుకుంటారనే విషయాన్ని కూడా చెప్పడం లేదని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా, ప్రజల ఆమోదం లేకుండా ఏ నిర్మాణాన్నీ కూల్చడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం ఇండ్లను కూల్చాలంటే మన్మోహన్సింగ్ హయాంలో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు నాలుగింతల పరిహారం బాధితులకు చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. మూసీకి ఇరువైపులా రిటైనింగ్వాల్స్ నిర్మించి కూడా సుందరీకరణ చేసుకోవచ్చని సూచించారు. నదికి ఇరువైపులా ఇండ్లు ఎక్కువ ఉన్న ప్రాంతాలను కాకుండా, ఖాళీ స్థలాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.