హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ఒక మార్పు చేస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పస్టియర్ ఇంగ్లిష్‌లో ఒక ప్రశ్నను అదనంగా చేర్చింది. 2025 మార్చి పరీక్షల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. అయితే ఇది రెగ్యులర్ విద్యార్థులకే వర్తిస్తుంది. ఇది వరకు ఫస్టియర్ ఇంగ్లిష్‌లో ప్రశ్నల సంఖ్య 16 ఉండగా, తాజాగా 17కు పెంచారు. ఈ అదనపు ప్రశ్నను సెక్షన్-సీలో ఇస్తారు. ఈ సెక్షన్లో ఇది వరకు ఐదు ప్రశ్నలుండగా, తాజాగా ఆరు ప్రశ్నలిస్తారు. జతపరచండి (మ్యాచ్ ది ఫాలోయింగ్) ప్రశ్నను అదనంగా ఇవ్వనున్నారు. సవరించిన మాడల్ పేపర్లను అనుసరించాలని బోర్డు సూచించింది. ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో ఇంప్రూవ్మెంట్ ఉండదని బోర్డు ప్రకటించింది. విద్యార్థి ఫస్టియర్, సెకండియర్లోని అన్ని సబ్జెక్టులకు పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం ఇంగ్లిష్ ప్రాక్టికల్ మార్కులను మెరుగుపరుచుకోవచ్చని (ఇంప్రూవ్మెంట్) బోర్డు వెల్లడించింది. ఇంటర్ ఇంగ్లిష్‌లో గతేడాది నుంచి ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టారు. నిరుడు ఫస్టియర్‌లో ప్రవేశపెట్టగా, ఈ ఏడాది సెకండియర్‌లో ప్రవేశపెట్టారు.
ఇంటర్లో జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లు
ఇంటర్ విద్యలో విద్యాప్రమాణాల పెంపు, పర్యవేక్షణకు జిల్లా అకడమిక్ మానిటరింగ్ విభాగాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాల్లో ముగ్గురు సభ్యులతో కూడిన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు జూనియర్ లెక్చరర్లు, ఒక లైబ్రేరియన్‌ను అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లుగా నియమించారు. వీరు జిల్లా, కాలేజీలవారీగా అత్యధికంగా గైర్హాజరవుతున్న విద్యార్థుల వివరాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహణ, స్లిప్‌టెస్టులు, ఫ్రీ ఫైనల్ పరీక్షల మూల్యాంకనం వంటి అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు.