బాయిలర్ కోళ్లతో పోల్చుకొంటే పెరటి కోళ్ల రుచే వేరు. గోధుమ వర్ణంలో ఉండే వీటి గుడ్లు కూడా ఆకర్షణీయంగానూ, రుచిగానూ ఉంటాయి. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. దీంతో గ్రామాల్లో వాటి పెంపకందారులకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఈ పరిస్థితిని గుర్తించిన స్త్రీనిధి సంస్థ స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. 100 కోళ్ల యూనిట్ స్థాపనకు రూ.22 వేల వరకు రుణం అందజేస్తున్నది.11 శాతం వడ్డీతో లభించే ఈ రుణాన్ని 24 వాయిదాల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నది.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మాంసప్రియులు బాయిలర్ కోళ్లకు బదులు పెరటి కోళ్లను తినడానికి ఇష్టపడుతుండటంతో వాటికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పెరటికోళ్ల పెంపకం పట్ల ఆసక్తి చూపే స్వయం సహాయక మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల యూనిట్లను పంపిణీ చేయాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు 9,500 యూనిట్లు పంపిణీచేశారు. స్వయం సహాయక సంఘాల నుంచి వస్తున్న స్పందనను చూసి ఎన్ని యూనిట్లకైనా రుణం ఇవ్వడానికి స్త్రీనిధి సిద్ధమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 37వేల యూనిట్లకు రుణాలను అందించారు. వీటి ద్వారా దాదాపుగా 3.70 లక్షల పెరటి కోళ్లను పెంచి, మార్కెట్లో విక్రయించారు. పెరటి కోళ్లకు మార్కెట్లో కిలోకు రూ.350-400 వరకు ధర లభిస్తుండటంతో పెంపకందారులు లాభాలు గడిస్తున్నారు. కోళ్ల పెంపకంతో పాటు మదర్ యూనిట్లను పెంచడానికి కూడా రుణాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క మదర్ యూనిట్‌కు రూ.2.91 లక్షల రుణం ఇస్తారు. వీటి ద్వారా నెలకు రూ.12వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా. పిల్లలు మూడు నెలలు పెరిగిన తరువాత వాటిని విక్రయిస్తారు.
ఇవి మేలు జాతి రకాలు
మేలు జాతి పెరటి కోళ్లు ఆకర్షణీయమైన రంగు, రంగుల ఈకలు, అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. పెద్ద సైజు గుడ్ల ఉత్పత్తి, పెంపకంలో తక్కువ ఖర్చు, ఎక్కువ రోజులు బతుకగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మేలు జాతి పెరటి కోళ్లలో రాజశ్రీ, వనరాజా, గిరిరాజా, శ్రీనిధి, అసిల్, కడక్‌నాథ్, గ్రామప్రియ, కృషిబ్రో, రైన్బో రోస్టర్ మొదలైన రకాలు ఉన్నాయి. పెరిటి కోళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని పెరటి అవరణలో సహజసిద్ధంగా దొరికే ఆహారం తృణధాన్యాలు, గడ్డిగింజలు, కీటకాలు, చెదలు, వానపాములను తిని అధిక పోషకాలు ఉన్న గుడ్లు, మాంసం ఉత్పత్తి చేస్తాయి.
పెరటి కోళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువ
గ్రామాల్లో పెరిగే నాటు కోళ్ల నుంచి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ గుడ్లు, మాంసాన్ని ఉత్పత్తి చేసే మేలు జాతి పెరటి కోళ్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేశారు. వీటిని దేశవాళీ కోళ్ల మాదిరిగా ఆరు బయట పెరటిలో పెంచుకోవచ్చు. పెరటి కోళ్లు తక్కువ బరువు, పొడవైన కాళ్లు కలిగి హానికర జంతువుల నుంచి సులువుగా తప్పించుకొంటాయి. ఇవి ముదురు ఎరుపు రంగు, మధ్యస్థ శరీర పరిమాణంతో నాటు కోడి మాదిరిగా కనిపిస్తాయి. వీటికి రోగనిరోధకశక్తి ఎక్కువ. గ్రామీణ వాతావరణంలో సులువుగా పెరుగుతాయి. నాటు కోళ్లతో పోలిస్తే త్వరగా మార్కెటింగ్ దశకు చేరుకొంటాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లకు మార్కెట్లో గిరాకీ ఎక్కువ.