హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకవైపు రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన టీజీఎస్ఆర్టీసీ.. మరోవైపు అధిక చార్జీలు వసూలుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో 50% వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బస్సుల ముందుభాగంలో చార్జీల బోర్డులు సైతం ఏర్పాటుచేసింది. దీంతో ప్రత్యేక బస్సులు పేరుతో అధిక చార్జీల వసూలుకు పాల్పడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. కాగా, రాష్ట్రంలోని 43 శైవక్షేత్రాలకు 3వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు సంస్థ తెలిపింది. బుధవారం నుంచి 28 వరకు ఈ బస్సులను నడపనున్నట్టు వెల్లడించింది.
809 అదనపు బస్సులు..
నిరుడితో పోలిస్తే ఈసారి 809 బస్సులు అదనంగా నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు.