హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భాష, యాసలకు ప్రాధాన్యమిచ్చి, కళాకారులను అమితంగా ప్రేమించి, ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ ఒక్కరేనని ప్రముఖ సినీ నటులు త్రిపురనేని చిట్టిబాబు, గౌతమ్‌రాజ్ ప్రశంసించారు. కేసీఆర్‌ను అన్ని వర్గాల ఆపద్బాంధవుడిగా కీర్తించారు.
సుదీర్ఘకాలం పోరాడి సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. శనివారం తెలంగాణభవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. సాంస్కృతిక, కళారంగాలను అపూర్వంగా ఆదరిస్తున్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలుగుభాష గొప్పతనాన్ని చాటిచెప్పి మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.