Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వచ్చినప్పుడు కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీస్తారని రాజకీయవర్గాల్లో విమర్శ ఉన్నది. సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ప్రజల దృష్టి మళ్లించేందుకేనన్న చర్చ నడుస్తున్నది. అరెస్ట్ తీరు, రేవంత్ అనుకూల మీడియాలో హడావుడి ఇందుకు బలం చేకూర్చుతున్నదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అటకెక్కించడం, అనాలోచిత నిర్ణయాలు బెడిసికొట్టడం, ప్రతిపక్షాలతో పాటు సొంతపార్టీ నేతల నుంచి కూడా విమర్శలు రావడంతో రేవంత్ డైవర్షన్ ఎత్తుగడను ఎంచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. లగచర్ల రైతుకు సంకెళ్లు వేయడంపై గురువారం తీవ్రదుమారం నెలకొంది. ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వ పెద్దలు అల్లు అర్జున్ అరెస్టును తెరపైకి తెచ్చారనే ఆరోపణలున్నాయి.
కాంగ్రెస్ పాలనపై సినీ ప్రముఖులు ఎవరూ పెద్ద గా మాట్లాడటంలేదు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టడం లేదు. రేవంత్‌రెడ్డి మాత్రం సినీప్రముఖులను భయపెట్టి దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సినీవర్గాల్లో చర్చ నడుస్తున్నది. సినిమారంగాన్ని భయపెట్టేందుకే జాతీయస్థాయి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు సినిమా ప్రముఖులు ఎవరూ రాలేదని బహిరంగంగా అన్నారు. ఆ తర్వాత నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేయడం, నాగార్జున కుటుంబంపై మరోమంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడటం వంటి పరిణామాలు జరిగాయి. కొండా సురేఖపై సినీప్రముఖులంతా ముక్తకంఠంతో నిప్పులుచెరిగారు. దీంతో రేవంత్‌కు కక్ష మరింత పెరిగిందని, అందులో భా గంగానే అర్జున్ అరెస్టన్న విమర్శలు వస్తున్నాయి.
వయనాడ్ ఎంపీగా ఎన్నికయిన కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంకగాంధీ లోక్‌సభలో శుక్రవారం తొలిసారి ప్రసంగించారు. కానీ ఆమె ప్రసంగానికి పెద్దగా కవరేజీ రాలేదు. నేషనల్ మీడియా కూడా అర్జున్ అరెస్ట్‌పైనే రోజంతా కథనాలు ఇచ్చింది. దీంతో ఢిల్లీలోనే ఉన్న రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసిన అధిష్ఠానం పెద్ద లు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టుతో భంగపడ్డ ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి కూడా శుక్రవారం తిప్ప లు పడ్డట్టు కనిపిస్తున్నది. మీడియా ప్రతినిధి అరెస్ట్ కేసులో ‘పారిపోయిన పెదరాయుడు’, ‘మోహన్‌బాబు ఎక్కడ’ ‘5 బృందాలతో గాలింపు’ అంటూ అనుకూల మీడియాలో కథనాలు ప్రసారం చేయించినట్టు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒక టాపిక్ నుంచి మరో టాపిక్కు డైవర్ట్ చేయడం మానుకుని పాలనపై డెడికేషన్ పెట్టాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.