హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మెడిసిన్ విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీ అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నాన్ స్టాండర్స్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మెడిసిన్ విషయంలో ఎలాంటి ఉపేక్ష పనికిరాదని స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మా కంపెనీలను చట్టప్రకారం శాశ్వతంగా క్లోజ్ చేయాలని ఆదేశించారు.