Number Plate | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్న కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) ఉండాలనే నిబంధనతో కొందరు వాహనాదారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ నిబంధన అమలులో ఉండగా, ఇక నుంచి అంతకు ముందు తయారైన వాహనాలకూ ఏర్పాటుచేసుకోవాలని ఆదేశిస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు సైతం ఇచ్చింది.
ఫిట్నెస్ టెస్టు సహా.. వాహనాలకు సంబంధించి రవాణాశాఖ ద్వారా ఏ సేవ పొందాలన్నా ఈ నంబర్ ప్లేట్ ఉంటేనే సాధ్యమని, ఆ నంబర్ ప్లేటు లేని వాహనాలకు రవాణాశాఖలో ఎలాంటి సేవలు అందబోవని, ఇన్సూరెన్స్ చేయడం కూడా కుదరదని తేల్చి చెప్పింది. ఇక ఆ ప్లేట్ లేకుండా వాహనాలు రోడ్డు ఎక్కితే జరిమానాతోపాటు బండ్లను సీజ్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో హెచ్ఎస్ఆర్పీ ఎలా తీసుకోవాలో తెలియక కొందరు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వాహనదారులు www.siam.in వెబ్సైట్లో ఈ హెచ్ఆర్పీని సులువుగా పొందవచ్చు. మీరు ఎంచుకున్న తేదీలో మీకు నచ్చిన డీలర్ దగ్గర సెప్టెంబర్ 30లోపు ఫిట్టింగ్ చేయించుకోవచ్చు.