నారాయణఖేడ్/హైదరాబాద్, మే 14: పోలింగ్ విధులు నిర్వహించినందుకుగానూ ఇతర పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో చెల్లిస్తున్న విధంగా రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరిన ఉపాధ్యాయులపై పోలీసులు ప్రతాపం చూపారు. పంపిణీ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పోలింగ్ సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ విధులు ముగించుకొని పోలింగ్ సిబ్బంది పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొన్నారు. పోలింగ్ విధులకు సంబంధించిన రెమ్యూనరేషన్‌ను జీవో 61 నిబంధనల ప్రకారం చెల్లించాలని ఉపాధ్యాయులు ఆర్డీవో అశోక చక్రవర్తిని కోరారు. ఆర్డీవో మాత్రం అందుకు ఒప్పుకోకుండా రూ.2400 చొప్పున చెల్లిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు అందుకు నిరాకరిస్తూ నిరసనకు దిగారు. ఉపాధ్యాయులను శాంతింపజేసే ప్రయత్నంలో పోలీసులకు, ఉపాధ్యాయులకు తోపులాట జరిగింది. పోలీసులు ఉపాధ్యాయులపై స్వల్ప లాఠీచార్జి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం అధికారులు జోక్యం చేసుకొని ఉపాధ్యాయులను శాంతింపజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెమ్యూనరేషన్ చెల్లిస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు రాత్రి వరకు అక్కడే వేచి ఉన్నప్పటికీ అధికారులెవరూ స్పందించకపోవడంతో చేసేదేమిలేక వెనుదిరిగారు.
రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరినందుకు ఉపాధ్యాయులను పోలీసులతో కొట్టించడమేంటని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకే రకమైన రెమ్యూనరేషన్ ఇవ్వాలని, పీఓ, ఏపీవోలకు రోజుకు రూ.600, ఓపీవోలకు రూ. 400 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నం 61ను ఈనెల 11న విడుదల చేసిందన్నారు. ఆ ఉత్తర్వుల ప్రకారమే మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పీవో, ఏపీవోలకు రూ.3,150 చెల్లిస్తున్నారని, నారాయణఖేడ్‌లో మాత్రం రూ.2,400 చెల్లించారని పేర్కొన్నారు. ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో రెమ్యూనరేషన్ చెల్లింపులో తేడా ఎందుకని ప్రశ్నించినందుకు ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా, ప్రశ్నించిన ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేసిన నారాయణఖేడ్ ఆర్డీవో, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల విధుల్లో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని సీఈవోను కోరారు. టీచర్లపై లాఠీచార్జి చేయడం అన్యాయమని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల విధులు నిర్వహించిన వారిపై లాఠీచార్జికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, పీ నాగిరెడ్డి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమలకాంతికృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పీ మధుకుమార్ బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని, ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్ సీఈవోకు వినతిపత్రాన్ని సమర్పించారు.