హైదరాబాద్ జూన్ 10 (నమస్తే తెలంగాణ): ‘అధైర్య పడొద్దు… అండగా ఉంటాం& మీకు న్యాయం జరిగేలా చూస్తాం…’ అని జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన సీడ్ పత్తి సాగు చేసిన రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భరోసా ఇచ్చారు. మంగళవారం బీఆర్ఎస్ నేత కురవ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పలువురు రైతులు నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. సీడ్ కంపెనీలు ఇచ్చిన విత్తనాలే సాగు చేశామని, అయితే పంట ఫెయిలైందని.. కొనబోమని.. పరిహారం ఇవ్వబోమని సదరు కంపెనీల బాధ్యులు చెప్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీల తీరుతో తమ బతుకులు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో కేటీఆర్ వెంటనే వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్‌కు ఫోన్ చేశారు. సీడ్ కంపెనీల నిర్వాహకులు, రైతులతో సమావేశం ఏర్పాటుచేసి సీడ్ పంట వేసిన రైతులకు నగదు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి: కురువ
గద్వాల జిల్లాలోని రైతులను మోసం చేసిన సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బాధిత రైతులతో కలిసి తెలంగాణభవన్‌లో మీడియాతో మాటాడుతూ… సీడ్ కంపెనీలు దగా చేయడంతో వందలాది మంది రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ల్యాబ్‌లో పరీక్షించకుండానే సీడ్ కంపెనీల బాధ్యులు ఏకపక్షంగా పంట ఫెయిలైందని నిర్ధారణకు రావడంపై ఆక్షేపణ వ్యక్తంచేశారు. పండించిన పంటను కొనకపోవడం, పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని, అవసరమైతే ప్రత్యేక చట్టం చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు సీడ్ కంపెనీలతో కుమ్మైక్కె రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. వెంటనే సీడ్ పత్తిని కొనుగోలు చేయాలని, లేదా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వారితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వానికి లేఖ రాస్తా: హరీశ్‌రావు
సీడ్ పత్తి రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అభయమిచ్చారు. తనను కలిసిన బాధిత రైతులతో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను లెవనెత్తి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. రైతులు అధైర్యపడొద్దని సూచించారు. అంతకుముందు సీడ్ పత్తి రైతులు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిశారు. ప్రత్యేక చట్టం చేసి తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై కోదండరెడ్డి స్పందిస్తూ.. ఈ నెలాఖరునాటికి ఆమోదించనున్న కొత్త వ్యవసాయ సీడ్ చట్టం ముసాయిదాలో పొందుపరిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.