చార్మినార్, డిసెంబర్ 7 : హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో లైంగిక వేధింపుల వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలి పట్ల ఓ పోలీసు అధికారి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ ఆరోపణలు వస్తున్న వ్యవహారం ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంపై ఆదివారం నమస్తే తెలంగాణ పత్రికలో ‘ఒంటరిగా నా దగ్గరకు వచ్చేయ్’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం.. డిపార్ట్మెంట్లో పెను సంచనలంగా మారింది. దీంతో తనపై వసున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ మీర్‌చౌక్ ఏసీపీ శ్యామ్‌సుందర్ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదులో దళిత మహిళ అని పేర్కొనడంతో కులనిర్ధారణ కోసం నాంపల్లి తహసీల్దార్‌కు లేఖ పంపామని తెలిపారు.
ధ్రువీకరణ పత్రం తాము జారీ చేయలేదంటూ తహసీల్దార్ నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని వివరించారు. అదే విషయాన్ని ఆ మహిళకు తెలియజేశామని చెప్పారు. ఏసీపీ మీడియా ముందుకు వచ్చిన తర్వాత బాధితురాలు స్పందించారు. ఏసీపీ మీడియా ముందు చెప్తున్న వివరాలు.. స్టేషన్‌కు వెళ్లినప్పుడే తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కులధ్రువీకరణ పత్రం విషయం గురించి తనతో ప్రస్తావించనేలేదని తెలిపారు. స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఏమీ చెప్పకుండా… రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ ఎందుకు చేశారని నిలదీశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపితే అన్ని నిజాలు బయటకు వస్తాయని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై పోలీసుశాఖలో చర్చ జరుగుతున్నా… ఉన్నతాధికారులు స్పందించలేదు.