హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రవీంద్రభవన్లో గురువారం సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ మాధవ్ కౌశిక్ భాషా సమ్మాన్ పురస్కారాన్ని రామబ్రహ్మానికి ప్రదానం చేశారు.
భాషా సమ్మాన్ నగదు బహుమతిగా రూ. లక్ష నగదు, తామ్రపత్రం, ప్రశంసాపత్రం అందజేశారు. ప్రాచీన, మధ్యయుగపు సాహిత్యంపై రామబ్రహ్మం వెలువరించిన రచనలకు.. 2021 సంవత్సరానికి ఈ అవార్డు దకింది. సాహితీ సేవకు గుర్తింపుగా దక్షిణ భారతదేశం నుంచి ఈ పురసారానికి ఆయన ఎంపికయ్యారు. కాగా ఆచార్య రామబ్రహ్మం కవిగా, రచయితగా, అనువాదకుడిగా, పండితుడిగా, వ్యాఖ్యాతగా, అష్టావధానిగా సుప్రసిద్ధులు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించారు. కథలు, కవిత్వం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచించారు. సాహితీ వ్యాసాలను వెలువరించారు.