Nizamabad | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ)/వినాయకనగర్: నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఓ నిందితుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వివాదంగా మారింది. పోలీసులు కొట్టడంవల్లే నిందితుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ జిల్లా దవాఖాన ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా అంతర్గాంకు చెందిన సంపత్ (32) జగిత్యాల జిల్లాలో మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగులను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ తదితర దేశాలకు పంపిచాడు. విదేశాలకు వెళ్లిన యువకులు తాము మోసపోయామని తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు సంపత్తో పాటు మరో ఏజెంట్‌పై పదిరోజుల క్రితం కేసు నమోదుచేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. నిందితులను సైబర్‌క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా గురువారం జగిత్యాలలో సంపత్ కన్సల్టెన్సీ ఆఫీసుకు తీసుకెళ్లారు. లావాదేవీలు, రికార్డులను పరిశీలించారు. రాత్రి నిజామాబాద్ సీసీఎస్‌కు తరలించారు.
స్టేషన్ లాకప్‌లో ఏమైంది?
గురువారం రాత్రి 10 గంటలకు ఛాతిలో నొప్పిగా ఉన్నదని, చేయి లాగుతున్నదని సంపత్ తెలిపాడని పోలీసులు చెప్తున్నారు. హుటాహుటిన జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించగా, సంపత్ చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందినట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నిజామాబాద్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు దవాఖాన ఎదుట బైఠాయించారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే సంపత్ మృతి చెందాడని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చించారు. అనుమానముంటే ఫిర్యాదు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
అనారోగ్యంతోనే మృతి
పోలీస్ కస్టడీలో సంపత్ అనారోగ్యంతోనే మరణించాడని నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఓ ప్రకటనలో వెల్లడించారు. దవాఖాన లోపలికి సంపత్ నడచుకుంటూ వెళ్లాడని, ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు నివేదిక అందించామని వివరించారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: జాన్‌వెస్లీ
పోలీసు కస్టడీలో నిందితుడు సంపత్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వానికి జాన్‌వెస్లీ లేఖ రాశారు. పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే అతడు చనిపోయాడని, సంపత్ శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని జాన్‌వెస్లీ చెప్పారు.