హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల ప్రాజెక్టుల డిజైన్లకు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా డిజైన్లను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీవో)లు రూపొందిస్తాయి. సీడీవోలు ఇచ్చిన డిజైన్స్‌ను సీడబ్ల్యూసీ నేరుగా ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా ఇదే ప్రక్రియ. ఇకపై డిజైన్ల విభాగాలకు అక్రెడిటేషన్ తప్పనిసరని కేంద్ర జల్‌శక్తిశాఖ స్పష్టంచేసింది. అక్రిడిటేషన్ కలిగిన సీడీవోల డిజైన్లను మాత్రమే సీడబ్ల్యూసీ పరిశీలించాలని కేంద్రజలశక్తిశాఖ నిర్ణయించింది. తెలంగాణలోని సీతారామ బహుళార్ధక సాధక ప్రాజెక్టు, వివిధ రాష్ర్టాల్లోని ఇతర ప్రాజెక్టులకు తుది అనుమతుల మంజూరు కోసం ఇటీవల కేంద్రజల్‌శక్తి కార్యదర్శి దేబశ్రీముఖర్జీ నేతృత్వంలో టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశమైంది. సమావేశానికి సంబంధించిన మినట్స్‌ను తాజాగా విడుదల చేసింది. సీతారామ ప్రాజెక్టు డిజైన్లను సీడబ్ల్యూసీ మరోసారి పరిశీలించిన తర్వాతనే అనుమతులు జారీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది.
డ్రోన్లతో ఆనకట్టల పర్యవేక్షణ ;ఇరిగేషన్ శాఖ సమాలోచనలు
హైదరాబాద్, మార్చి3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్యామ్ సేఫ్టీ చట్టం పరిధిలో 174 డ్యామ్‌లు రిజిస్టర్ అయ్యాయి. వీటికి సంబంధించి స్పిల్‌వే, గేట్లు తదితర నిర్మాణాలను పరిశీలించడం సవాల్‌తో కూడినది. దీంతో డ్యామ్‌ల పర్యవేక్షణకు ఇకనుంచి డ్రోన్ టెక్నాలజీని వినియోగించే దిశగా ఇరిగేషన్‌శాఖ ఆలోచిస్తున్నది. వరదలను నియంత్రించడం, ఆనకట్టల డ్యామేజీ, లోపాలు గుర్తించడంలో డ్రోన్లు వినియోగిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశమున్నదని, క్లిష్టమైన సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నది. దీనిపై బుధవారం జలసౌధలో వన్డే వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.