హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి వారణాసికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం అక్కడ అత్యంత సువిశాల వసతి గృహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను దేవాదాయ, ధర్మాదాయ శాఖకు అప్పగించింది. సాధ్యమైనంత త్వరలో ఈ వసతి గృహ నిర్మాణాన్ని చేపట్టేందుకు శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రం నుంచి రోజూ వారణాసికి సగటున ఎంతమంది భక్తులు వెళ్తున్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై చర్చించారు. వసతి గృహం నిర్మాణానికి భూమి కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.
భూమి కేటాయింపు జరిగిన వెంటనే వసతి గృహం నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని నిర్ణయించారు. ఒకవేళ భూ కేటాయింపులో జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనైనా భూమిని కొనుగోలుచేసి వసతి గృహాన్ని నిర్మించాలని యోచిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణ నుంచి వారణాసికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారు. అక్కడ తెలుగువారికి సంబంధించిన ప్రైవేటు లాడ్జిలు, హోటళ్లు ఉన్నప్పటికీ ఎక్కువ అద్దె వసూలు చేస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అక్కడ విశాలమైన వసతి గృహాన్ని నిర్మించడంతోపాటు దైవ దర్శనం, సమీప ప్రాంతాల్లోని దర్శనీయ ప్రదేశాల గురించి భక్తులకు మార్గదర్శనం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.