హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. ఇది వరకు 29 పేపర్లకు పరీక్షలు నిర్వహించగా, ఆ సంఖ్య 30కి పెరిగింది. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నట్టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) పేర్కొన్నది. మన రాష్ట్రంలోని హైదరాబాద్, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ తదితర పట్టణాల్లో నిర్వహిస్తారు. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.