
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో ఏదైనా కార ణంతో లావాదేవీ నిలిచిపోయినవారికి అప్పటికే ఫీజు కింద చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇచ్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఈ నెల 16 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 15,560 దరఖాస్తుల్లో దాదాపు 90% పరిష్కరించి సొమ్ము రిఫండ్ చేసినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ భూమి కొనుగోలు లేదా అమ్మకం కోసం ధరణి పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించా ల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో లావాదేవీ వద్దనుకుంటే స్లాట్ రద్దు చేసుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రత్యేక మా డ్యూల్‌ను ప్రవేశపెట్టారు. రైతు చెల్లించిన ఫీజులో 90 శాతాన్ని రిఫండ్ చేస్తారు. పెండింగ్ మ్యుటేషన్, వారసత్వ బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నవారు సైతం ముందుగానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కలెక్టర్ ఆ దరఖాస్తును తిరసరిస్తే డబ్బు రిఫండ్ చేస్తారు. రిఫండ్ చాలా ఆలస్యం అవుతున్నదని, నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తున్నదని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్య మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ దృష్టికి వెళ్లడం తో.. రిఫండ్ ఆలస్యం చేయొద్దని, పెం డింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాల ని ఆదేశించినట్టు సమాచారం. దీంతో రిఫండ్ కోసం వచ్చిన దరఖాస్తులపై కలెక్టర్లు గత కొన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ నెల 16 నాటికి రిఫండ్లు
దరఖాస్తులు 15,560
పరిషరించినవి 13,853
పెండింగ్‌లో ఉన్నవి 1,707